ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.
పర్యావరణహిత గణేష్ ఉత్సవాలకు పిలుపు
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ప్రజలకు ఎస్పీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ
భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్రజలు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ జారీ చేసే సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వినాయకుడి పూజా కార్యక్రమంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు మధుకర్, సురేష్, సీఐ మధుకర్, ఆర్ఎస్ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, సాయి కిరణ్, జునైద్, శ్రీనివాస్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












