తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను డిజిటలైజ్ చేయాలి.
సిరివెలుగు, కరీంనగర్: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జ్ఞాన్ భారతం మిషన్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో తాళపత్రాలు, లోహాలు, రాతిపై లిఖించిన పురాతన గ్రంథాలు, పద్యాలు, శాసనాలను సేకరించాలని సూచించారు. ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన సంపద ఉండే అవకాశం ఉందన్నారు.

వాటిని గుర్తించి డిజిటలైజ్ చేసేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజల వద్ద ఉన్న పురాతన గ్రంథాలు, శాసనాల సమాచారాన్ని 9640967943 నంబర్కు తెలియజేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.











