సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, టీజీఎంఎస్ఐడీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించిన 9 సబ్ సెంటర్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఒక సబ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో ఆరు భవనాల పనులు తుది దశలో ఉన్నాయని వివరించారు. భవనాల్లో నీరు, విద్యుత్, టాయిలెట్ తదితర మౌలిక వసతులు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ మహేష్ బి. గితే ప్రారంభించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్, అధికారులు పాల్గొన్నారు.











