గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు స్వీకరణ
సిరివెలుగు, సిరిసిల్ల: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 33 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులను స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.











