అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు.
కేటీఆర్ కౌంటర్.. భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్.
జీఓ 134తో భూ విచారణ కమిటీ.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుపాను!
30న సిరిసిల్లలో సీఎం భారీ బహిరంగ సభ.
మరింత వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం.
8వేల ఎకరాలు.. సిరిసిల్లలో కబ్జా భూముల అసలు కథేంటి?
సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. అసెంబ్లీలో సెప్టెంబర్ 16న 22-ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ వ్యవహారాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన సీఎం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ధరణి పోర్టల్ ద్వారా వివిధ వ్యక్తులకు బదలాయించబడిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తోంది. 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది.. ఎవరి పేర్లకు బదలాయించారు..ఏ సర్వే నంబర్లు..ఎవరెవరు లబ్ధి పొందారు… అనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, అలాగే స్వాధీనం చేసుకున్న 2400 ఎకరాల భూమి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలను నిరూపించకపోతే సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు.
అసెంబ్లీ వ్యాఖ్యల నుంచి జీఓ 134 వరకు.
సీఎం వ్యాఖ్యల తర్వాత భూ వ్యవహారం రాజకీయ విమర్శల స్థాయిని దాటి అధికారిక విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.సంజయ్ జాజు జారీ చేసిన జీఓ నంబర్ 134 ద్వారా పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన ఆరోపణలు, రికార్డులు, నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.శ్రీదేవసేన నేతృత్వం వహించనుండగా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా, జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సభ్యుడిగా ఉన్నారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఆయా కేసుల విషయంలో కమిటీకి సహకరించనున్నారు. కేవలం ఒక్క రకమైన భూములకే విచారణ పరిమితం కాకుండా ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, అసైన్డ్ భూములు, జాగీర్, భూదాన్, ఇనాం, అటవీ భూములు, భూసేకరణ, పునరావాసం, నీటి వనరులు, క్యాచ్మెంట్ ప్రాంతాలు, భూ రికార్డులు తదితర అంశాలను పరిశీలించేలా కమిటీకి విస్తృత పరిధి ఇచ్చినట్లు సమాచారం. అలాగే 22ఏ భూములపై ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అనుమతులున్న స్థలాల నమోదుకు మార్గం చూపింది. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది
సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి.

జీఓ 134లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పలు అంశాలు కూడా విచారణ పరిధిలోకి వచ్చినట్లు తెలిసింది. సర్దాపూర్, లక్ష్మీపూర్, తంగళ్లపల్లితో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కేటాయింపులు, అసైన్డ్ భూముల కొనుగోళ్లపై వచ్చిన ఆరోపణలను పరిశీలించనున్నారు.
అలాగే మిడ్‌మానేరు రిజర్వాయర్ భూసేకరణకు సంబంధించిన పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైనా విచారణ జరగనుంది. ఇదే సమయంలో సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన పలు భూ వ్యవహారాలు కూడా జీఓలో ప్రస్తావనకు వచ్చినట్లు వినబడుతోంది. మొత్తంగా 16 అంశాలను పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం.
8వేల ఎకరాలపై బీఆర్ఎస్ ఎదురుదాడి.
సీఎం ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేశారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, లబ్ధిదారులు, బదలాయింపుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కూడా డిమాండ్ చేశారు. ఇక న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తనపై అసెంబ్లీలో చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ ముఖ్యమంత్రికి న్యాయ నోటీసు పంపిన విషయం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఏడు రోజుల్లో ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆయన నోటీసులో కోరారు.
బీఆర్ఎస్ మరో డిమాండ్.. ఇరువైపులా విచారణ.
భూ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి పెంచింది. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తులపైనా విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు వైపులా భూ వ్యవహారాలపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని కేటీఆర్ తదితరులు సవాల్ చేస్తున్నారు. మరోవైపు 22-ఏ నిషేధిత భూముల జాబితాపై సామాన్యుల ఆస్తులు కూడా ప్రభావితమయ్యాయన్న అంశం మరో కోణంలో ముందుకొచ్చింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపి బాధితులకు ఉపశమనం కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం.
30న సిరిసిల్లలో సీఎం సభ.. ఏం చెప్పబోతున్నారు?
ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 30న సిరిసిల్లలో భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వర్గాలు సభను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, ఇటీవల అసెంబ్లీలో భూ వ్యవహారాలపై సీఎం చేసిన ఆరోపణలు.. వాటికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతిస్పందనలు…ఈ పరిణామాలన్నింటి మధ్య జరగనున్న సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే సీఎం సభలో సిరిసిల్ల భూముల వ్యవహారంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తారా.. 8 వేల ఎకరాల ఆరోపణకు సంబంధించిన సర్వే నంబర్లు, రికార్డులు బయటపెడతారా…ఇప్పటికే జీఓ 134తో మొదలైన విచారణకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తారా… అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మాటల యుద్ధం నుంచి రికార్డుల దిశగా..
ఇప్పటివరకు ఈ వ్యవహారం ప్రధానంగా ఆరోపణలు, ప్రత్యారోపణల చుట్టూనే తిరుగుతున్నప్పటికీ.. జీఓ 134తో అధికారిక విచారణ ప్రారంభం కావడంతో భూ రికార్డులు, సర్వే వివరాలు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కీలకంగా మారనున్నాయి.
ప్రభుత్వం చెబుతున్న ఆరోపణలకు విచారణలో ఎలాంటి ఆధారాలు బయటపడతాయి.. బీఆర్ఎస్ చేస్తున్న ప్రత్యారోపణలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది… సిరిసిల్లకు సంబంధించిన 8 వేల ఎకరాల అంశంపై అధికారిక రికార్డులు ఏమి చెబుతాయి…అన్నది ఇప్పుడు రాజకీయ చర్చలో ప్రధాన అంశంగా మారింది. సెప్టెంబర్ 30న సిరిసిల్ల వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసే ప్రసంగం ఈ భూ వివాదానికి ఎలాంటి కొత్త మలుపు ఇస్తుందన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.











