వివాదాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ముప్పు కాకుండా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజీ చేయదగిన పెండింగ్‌ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్‌ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.…

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ముప్పు కాకుండా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజీ చేయదగిన పెండింగ్‌ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్‌ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు, మానసిక ప్రశాంతత కోల్పోవడం కంటే చర్చల ద్వారా రాజీకి రావడం ఉత్తమమన్నారు. భార్యాభర్తలు చిన్నచిన్న విభేదాలతో విడిపోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించాలని సూచించారు. అన్నదమ్ములు ఆస్తులు, భూముల విషయంలో వివాదాలకు వెళ్లకుండా కుటుంబ ఐక్యతను కాపాడుకోవాలని కోరారు. ఆస్తి విభజన, భూ వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్‌ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో బార్‌ అసోసియేషన్‌, మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు.

లోక్ అదాలత్‌లో 12,666 కేసులకు పరిష్కారం.

జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో 12,666 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. పరిష్కరించిన కేసులకు సంబంధించి బాధితులకు మొత్తం రూ.2,02,72,283 నష్టపరిహారం ఇప్పించినట్లు వెల్లడించారు. పరిష్కరించిన కేసుల్లో 11,456 ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు, 860 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, 213 క్రిమినల్‌ కేసులు, 49 బ్యాంకు కేసులు, 29 ఎక్సైజ్‌ కేసులు, 22 సైబర్‌ క్రైమ్‌ కేసులు, 17 మోటార్‌ వాహన ప్రమాద కేసులు, 12 సివిల్‌ తగాదాలు, 4 చెక్‌ బౌన్స్‌ కేసులు, ఒక గృహహింస కేసు, 3 టెలిఫోన్‌ కేసులు ఉన్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి. లక్ష్మణాచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

రాజీయే రాజ మార్గం: పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను ఆమె పరిశీలించారు. ప్రజలు తమ వివాదాలను దీర్ఘకాలం కొనసాగించకుండా, అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకొని రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!