బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో విమలక్క బతుకమ్మ సందడి!

వేములవాడలో ఘనంగా ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు. బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు.. ప్రజా పోరాటాలకు ప్రతీక: విమలక్క. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, ఆటపాటల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క…

వేములవాడలో ఘనంగా ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు.

బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు.. ప్రజా పోరాటాలకు ప్రతీక: విమలక్క.

సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, ఆటపాటల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ ఈ ఏడాది ‘బహుజన బతుకమ్మ’ నినాదంతో ఊరూరా, వాడవాడలా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. వేములవాడ మూలవాగు వద్ద ఆటపాటలతో ప్రజలతో మమేకమై, తిరిగి తమ యాత్రను కొనసాగిస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి, రైతాంగ సంక్షేమం, ప్రజల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా బహుజన బతుకమ్మ ముందుకు సాగుతోందని వివరించారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలంటే వ్యవసాయ భూములకు సాగునీరు అందాలని, పండించిన పంటలపై రైతులకు హక్కులు ఉండాలని ఆకాంక్షించారు. బతుకమ్మను కేవలం పండుగగా కాకుండా ప్రజా సమస్యలపై చైతన్యం కలిగించే వేదికగా చూడాలని విమలక్క పిలుపునిచ్చారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడటం, యువత, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సంఘటితంగా ముందుకు రావాలన్నారు. ఢిల్లీలో యువత చేపడుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటించిన విమలక్క, విద్యార్థులు, యువతపై జరిగిన దాడులను ఖండించారు. ఘటనలకు బాధ్యులైన అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున ప్రజలు పోరాటాలకు మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం జై తెలంగాణ నినాదాలతో ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ సరస్వతి, 20వ వార్డు కౌన్సిలర్, బీజేపీ సీనియర్ నాయకుడు కుమ్మరి శంకర్, జ్యోతి, వారి కుటుంబ సభ్యులు దేవిక, అనిల్‌తో పాటు స్థానిక నాయకులు, వార్డు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!