థర్డ్ డిగ్రీ ఆరోపణలపై డీఎస్పీ స్థాయి విచారణ.
నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌ను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఎస్ఐపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించారు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ‘ఓ పత్రికలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లపై గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, 2026 అక్టోబర్ 13న రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అయితే, ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తుది నివేదిక ఆధారంగా చర్యలువిచారణ పూర్తయ్యే వరకు ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణలో ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.











