జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఆలోచన, కేటీఆర్ కృషి పునాది.
దశాబ్ది ఉత్సవాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. జిల్లా ఏర్పాటు వెనుక ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం, నాయకుల కృషి ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పనుల కోసం సిరిసిల్ల ప్రాంత ప్రజలు కరీంనగర్కు వెళ్లాల్సి వచ్చేదని, స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా ఏర్పాటు జరిగిందని వివరించారు. అప్పటి మంత్రి కేటీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారని పేర్కొన్నారు. మెడికల్, నర్సింగ్, వ్యవసాయ కళాశాలలు, నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, గ్రంథాలయం వంటి సంస్థల ఏర్పాటుతో పాటు అపెరల్ పార్క్, ఆక్వా పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కూడా జిల్లా ఏర్పాటు కోసం కృషి చేశారని గుర్తుచేశారు.
గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి.
జిల్లా అభివృద్ధి కేవలం జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు సైతం చేరాలని వినోద్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం, నాణ్యమైన విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రహదారులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్య సంస్థల అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్నారు. జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ఉద్యమకారులు, ప్రజాప్రతినిధుల సేవలను స్మరించుకుంటూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ కల చక్రపాణి, సెస్ చైర్మన్ చీకల రామారావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మనోహర్ రెడ్డి, సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.











