300 మంది పోలీసులతో బందోబస్తు.
డీజేలకు అనుమతి లేదని స్పష్టం.
రీల్స్, సెల్ఫీల కోసం ప్రమాదాలకు పాల్పడొద్దని సూచన.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా సుమారు 300 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శోభాయాత్రలు జరిగే మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు, పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే వేములవాడతో పాటు జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ తెలిపారు. రేపు నిమజ్జనం నిర్వహించే మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటిస్తూ నిర్ణీత సమయానికి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటించాలని, వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
రీల్స్, సెల్ఫీల కోసం ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
గణేష్ శోభాయాత్ర సమయంలో రీల్స్, సెల్ఫీల కోసం వాహనాలపైకి ఎక్కడం, క్రేన్లు లేదా గణేష్ విగ్రహాలపైకి ఎక్కడం, నీటి ప్రాంతాల వద్ద ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకోవడం, వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలబడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. శోభాయాత్రలో మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సందర్భంగా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ మహేష్ బి.గితే కోరారు.











