22ఏ జాబితా నుంచి 2 వేల ఎకరాలకుపైగా భూముల తొలగింపు.
అర్హులైన పేదలకు స్వాధీనం చేసుకున్న భూముల పంపిణీ.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో పేదల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజన్న సిరిసిల్ల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధరణి, 22ఏ నిబంధనల కారణంగా గతంలో పేదలు భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

జిల్లాలో 2 వేల ఎకరాలకు పైగా పేదల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. సిరిసిల్లలో సుమారు 8 వేల ఎకరాల కబ్జా భూములతో పాటు ఇతర ప్రాంతాల్లోని మిగులు భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. స్వాధీనం చేసుకున్న భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి 12 అంశాలతో మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు, ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి భూములు, ఇళ్లు, హక్కులకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.











