సిరిసిల్ల మానేరు తీరంలో ఎస్పీ కలిసి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలిన.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గితే, పలు శాఖల అధికారులతో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.











