28న సిరిసిల్లలో ఆత్మగౌరవ సింహగర్జన మహాధర్నా.
విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం పిలుపు.
సిరివెలుగు, సిరిసిల్ల : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ముదిరాజు సంఘ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ముదిరాజుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ నెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ‘ఆత్మగౌరవ సింహగర్జన’ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను ప్రస్తుత బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో ముదిరాజుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ముదిరాజుల చిరకాల సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికే సిరిసిల్లలో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా కోరుతున్నట్లు వెల్లడించారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వేములవాడలో 5 ఎకరాల స్థలం కేటాయించి ముదిరాజ్ సత్రం ఏర్పాటు చేయాలని, 50 ఏళ్లు నిండిన ముదిరాజులకు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల చిరకాల వాంఛలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డైరెక్టర్ కూనవేణి పరశురాములు, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాండ్లు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తిక్, సీనియర్ నాయకులు రాయిని ప్రతాప్, పసుపుల తిరుపతి, బొజ్జ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.











