ఫోర్జరీ సంతకాలతో కళాశాల విక్రయం? కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్‌ ఆరోపణ!

ఎస్కేడిఆర్ జూనియర్‌ కళాశాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ జూనియర్‌ కళాశాలను తమకు తెలియకుండా విక్రయించారని, సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించారని ఆరోపిస్తూ కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్‌ పోలీసులను ఆశ్రయించారు. భాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. వెంకంపేటకు దిడ్డి శ్రీనివాస్‌ వికాస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌గా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్‌…

ఎస్కేడిఆర్ జూనియర్‌ కళాశాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు.

సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ జూనియర్‌ కళాశాలను తమకు తెలియకుండా విక్రయించారని, సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించారని ఆరోపిస్తూ కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్‌ పోలీసులను ఆశ్రయించారు. భాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. వెంకంపేటకు దిడ్డి శ్రీనివాస్‌ వికాస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌గా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో అనంతనగర్‌లో నిర్వహిస్తున్న పద్మశ్రీ జూనియర్‌ కళాశాలను 2004లో మరికొందరితో కలిసి తాను కొనుగోలు చేసి, అనంతరం కళాశాల పేరును శ్రీకృష్ణదేవరాయ జూనియర్‌ కళాశాలగా మార్చి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సొసైటీకి తాను అధ్యక్షుడిగా, ఏ.శంకర్‌రావు ఉపాధ్యక్షుడిగా, గుగ్గిళ్ల జగన్‌గౌడ్‌ ప్రధాన కార్యదర్శిగా, గుగ్గిళ్ల శ్రీనివాస్‌ సహాయ కార్యదర్శిగా, గుగ్గిళ్ల శైలజ కోశాధికారిగా, ఏ.ప్రణిత, దిడ్డి రమ సభ్యులుగా ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.

లెక్కల విషయంలో అనుమానం.

కళాశాలకు సంబంధించిన లెక్కలు చూపించాలని 2024 ఏప్రిల్‌ 18 నుంచి ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల జగన్‌గౌడ్‌ను కోరుతున్నప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇతర సొసైటీ సభ్యులను ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా కళాశాలను విక్రయించినట్లు తెలిసిందని, తాను, తన భార్య దిడ్డి రమ జగన్ గౌడ్ ను ప్రశ్నించగా కళాశాలను విక్రయించామని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడిగా తాను, సభ్యురాలిగా తన భార్య ఉన్నప్పటికీ తమ సంతకాలు లేకుండా కళాశాలను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు.

సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపణ.

ఈ వ్యవహారంపై 2024 డిసెంబర్‌ 10న ఇంటర్మీడియట్‌ బోర్డును సంప్రదించి సంబంధిత పత్రాలను పరిశీలించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. 2023 డిసెంబర్‌ 1న తమకు సమాచారం లేకుండా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించినట్లు, సొసైటీ పత్రాల్లో సభ్యుల పేజీని మార్చి తనతో పాటు తన భార్య సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించినట్లు గుర్తించామని ఆరోపించారు. ఆ పత్రాలను ఉపయోగించి కళాశాలను ఇతరులకు బదలాయించారని ఆరోపిస్తూ, వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా
ఫిర్యాదుపై సిరిసిల్ల టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. కాగా
కళాశాల, ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు, హక్కులు, లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పత్రాల నిజానిజాలు, సంతకాల వ్యవహారం, కళాశాల బదలాయింపులో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిసింది. దర్యాప్తు అనంతరం పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!