ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకే దాడులు, దౌర్జన్యాలంటూ ఆరోపణలు.
సిరివెలుగు, సిరిసిల్ల: శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తోట ఆగయ్య ఆరోపించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడేలా ప్రోత్సహించడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ 14 ఏళ్ల పాటు రాజీలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.
ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నేత గూడూరు ప్రవీణ్ అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులపాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రేవంత్రెడ్డి పాలన వద్దనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకే ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల వ్యవహారశైలిని ఖండించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, నాయకులు బొల్లి రామ్మోహన్, మీసరగండ్ల అనిల్కుమార్, కుంబాల మల్లారెడ్డి, రాజు, మ్యాన రవి, బాలమల్లు, సాయికుమార్, కందుకూరి రామగౌడ్, అనిల్గౌడ్, మొగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.











