
పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన.
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం.
సీఎంఆర్ఎఫ్ పేద కుటుంబాలకు కొండంత అండ.
తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు.
సిరివెలుగు, తంగళ్లపల్లి: నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపల్లె, అంకుషపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి నాయకులు ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిగెల రాజు మాట్లాడుతూ సొంత ఇల్లు లేని నిరుపేదల కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని, నిరుపేదలకు ఆ భరోసాను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులు అందజేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు చేరేలా తమ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని మునిగెల రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం, గ్రామ సర్పంచ్ ప్రేమ్, శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు పొన్నాల పర్శరాములు, ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరేపల్లి బాలు, లింగాల భూపతి, బండి పర్శరం, ప్రశాంత్, తిరుపతి, మిరాల శ్రీనివాస్, రవి, ప్రేమ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజేశం, వెంకటరెడ్డి, సారయ్య, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.











