వార్త రాస్తే నేరమా.. ప్రశ్నిస్తే శిక్షనా?

కలం పట్టిన చేతులపై కాఠిన్యమా? నేరెళ్ల నుంచి గంభీరావుపేట దాకా. జర్నలిస్టుల భద్రతపై మళ్లీ వెల్లువత్తుతున్న ప్రశ్నలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజల పక్షాన నిలబడాల్సిన కలం.. అధికారాన్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటి? ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే వేధింపులు ఎదుర్కోవాల్సిందేనా? ఒక వార్త రాసినందుకు జర్నలిస్టు, అతని కుటుంబం మానసిక ఆందోళనకు గురికావాల్సిందేనా? తప్పు జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చాల్సింది పోయి.. ప్రశ్నించే గొంతుకలే లక్ష్యంగా మారితే ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర…

కలం పట్టిన చేతులపై కాఠిన్యమా?

నేరెళ్ల నుంచి గంభీరావుపేట దాకా.

జర్నలిస్టుల భద్రతపై మళ్లీ వెల్లువత్తుతున్న ప్రశ్నలు!

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజల పక్షాన నిలబడాల్సిన కలం.. అధికారాన్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటి? ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే వేధింపులు ఎదుర్కోవాల్సిందేనా? ఒక వార్త రాసినందుకు జర్నలిస్టు, అతని కుటుంబం మానసిక ఆందోళనకు గురికావాల్సిందేనా? తప్పు జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చాల్సింది పోయి.. ప్రశ్నించే గొంతుకలే లక్ష్యంగా మారితే ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఏమవుతుంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరోసారి ఇలాంటి ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి.

నేరెళ్ల ఘటన.. ఇంకా మిగిలే ఉన్న గాయాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లాకు నేరెళ్ల ఘటన ఒక చేదు జ్ఞాపకం. ఇసుక లారీల వ్యవహారంపై నిరసనలు, పోలీసుల చర్యలు, దళితులపై చిత్రహింసల ఆరోపణలతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార వ్యవస్థ తీరుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆ ఘటన.. ప్రజల హక్కులు, పోలీసుల బాధ్యత, ప్రభుత్వ జవాబుదారీతనం ఎంత కీలకమో గుర్తుచేస్తూనే ఉంది. కాలం మారింది.. పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి. కానీ అధికార వ్యవస్థను ప్రశ్నించే వారి పరిస్థితి, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే వారి భద్రతపై సందేహాలు మళ్లీ తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. నేరెళ్ల ఘటనను గుర్తుచేసుకుంటున్న వేళ గంభీరావుపేటలో వెలుగుచూసిన పరిణామాలు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

వార్తలపై కేసులు.. ఆ తర్వాత ఏం జరిగింది?

గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేశారంటూ ఒక దిన పత్రికలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పోతురి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్టోబర్‌ 13న వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, పోలీస్‌స్టేషన్‌లో వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ ఆరోపణలు రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ను ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే ఏ అధికారిపైనైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒకవైపు వార్తలు అసత్యమంటూ కేసులు.. మరోవైపు పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు.. చివరకు విచారణకు ఆదేశాలు. ఈ పరిణామాల్లో అసలు నిజం ఏమిటనేది నిష్పాక్షిక విచారణలో తేలాలి. అయితే, వార్తలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు చట్టపరమైన మార్గాలను అనుసరించడంతోపాటు, పోలీసులపై వచ్చిన ఆరోపణలను కూడా అంతే పారదర్శకంగా విచారించాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉంది. మీరు ఏమైనాప్పటికీ ఈ విషయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తీసుకున్న నిర్ణయం పట్ల మరోవైపు హర్షాతిరేఖలు వ్యక్తమౌవుతున్నాయి.

జర్నలిస్టు కుటుంబం చేసిన తప్పేంటి?

ఒక విలేకరి వార్త రాస్తాడు. ఆ వార్తలో వాస్తవాలు ఉంటే ప్రజలకు సమాచారం అందుతుంది. పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచురించినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియలో జర్నలిస్టుకు భద్రత, న్యాయపరమైన రక్షణ, తన వాదన వినిపించే అవకాశం ఉండాలి. ఒక కేసు నమోదైతే అది కేవలం విలేకరికి మాత్రమే పరిమితమవుతుందా? అతని కుటుంబం ఆందోళనకు గురికాదా? పిల్లల చదువులు, కుటుంబ జీవనం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడదా? అరెస్టు, విచారణ, న్యాయపోరాటం వంటి పరిణామాలు ఎదురైతే ఆ కుటుంబం పడే మానసిక వేదనకు బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలు పోలీసు శాఖను తప్పుబట్టేందుకు మాత్రమే కాదు. జర్నలిస్టులకూ బాధ్యతలు ఉన్నాయని గుర్తుచేస్తూనే, వారి హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పేందుకు. వార్త రాసినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కారు. అదే సమయంలో జర్నలిస్టు అన్న కారణంతో ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడానికి కూడా వీల్లేదు.

కలానికి సంకెళ్లు పడితే.. ప్రజల గొంతుక మూగబోతుందా?

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రభుత్వాలను పొగడటానికో, వ్యక్తులను కించపరచటానికో పరిమితం కాదు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, అధికారుల పనితీరును ప్రశ్నించడం, ప్రజలకు వాస్తవాలను చేరవేయడం దాని ప్రధాన బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో జర్నలిస్టులు వాస్తవాల నిర్ధారణ, ఆధారాల సేకరణ, సంబంధిత పక్షాల వివరణ వంటి వృత్తిపరమైన ప్రమాణాలను పాటించాలి. అదే సమయంలో వార్తలపై అసమ్మతి ఉన్నా బెదిరింపులు, వేధింపులు లేదా చట్టవిరుద్ధమైన చర్యలకు తావుండకూడదు. తప్పు వార్త అయితే చట్టబద్ధంగా సవాలు చేయాలి. పోలీసులపై ఆరోపణలు వస్తే నిష్పాక్షిక విచారణ జరగాలి. ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందే. నేరెళ్ల ఘటన నుంచి గంభీరావుపేట పరిణామాల వరకు.. ఒక విషయం మాత్రం స్పష్టంగా నిలుస్తోంది. ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకలకు భద్రత కల్పించడం, అధికార వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టడం అత్యంత అవసరం. కలం పట్టిన ప్రతి జర్నలిస్టు ప్రశ్నించగలగాలి.. తప్పు చేస్తే చట్టం ముందు సమాధానం చెప్పగలగాలి. కానీ వార్త రాసినందుకు భయపడాల్సిన పరిస్థితి మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. జర్నలిస్టు కుటుంబం భయంతో బతకాల్సిన అవసరం లేని వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వం , పోలీసు శాఖ, సమాజం బాధ్యత.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!