పొట్ట దశలో పంట..ఆవేదనలో రైతులు..
విద్యుత్ కోతలపై గంభీరావుపేట రైతుల ధర్నా.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: వరి పంట పొట్ట దశలో విద్యుత్ కోతలు విధించడంపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలంలోని గజసింగవరం, గోరంటాల, సముద్రలింగాపూర్, రాజేశ్వరరావు కాలనీ గ్రామాలకు చెందిన రైతులు సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కరెంటు కోతల కారణంగా పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల బైఠాయింపుతో ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పంటలకు సరిపడా విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించినట్లు తెలిసింది.











