గతంలో జరిగిన వ్యవహారంపై సమన్లు ఇవ్వడం కక్షసాధింపు.
సెస్ విచారణకు సహకరిస్తూ.. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం.
సిరివెలుగు, సిరిసిల్ల: సహకార శాఖ చట్టం కింద సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)కు సంబంధించిన విచారణకు తమను హాజరు కావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు స్పందించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార శాఖ 1964 చట్టంలోని 51 విచారణ, 55 సెక్షన్ ప్రకారం విచారణకు సంబంధించి ఈ నెల 25న హాజరు కావాలని తమ పాలకవర్గానికి సమన్లు అందాయని తెలిపారు. గతంలో సహకార శాఖ పంపిన సమన్లకు పాలకవర్గంలో ఒక్కొక్కరుగా విచారణకు హాజరై తమ సమాధానాలను ఇచ్చామని, సంబంధిత రికార్డులన్నీ సహకార శాఖ వద్ద ఉన్నాయన్నారు. ఈ క్రమంలో సహకార శాఖ సమన్లలో పంపిన 11 అంశాలపై సమాధానాలు ఇవ్వడానికి పాలకవర్గానికి నెల రోజుల గడువు ఇవ్వాలని కోరారు. అలాగే డీసీవో స్థాయి అధికారి విచారణ అధికారిగా హాజరు కావాల్సి ఉందని తెలిపారు. 2016లో జరిగిన వ్యవహారానికి సంబంధించి ప్రస్తుత పాలకవర్గంతో పాటు అధికారులను కలుపుకొని మొత్తం 36 మందికి సమన్లు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జారీ చేసిన సమన్లలో 2014 నుంచి జరిగిన వ్యవహారాలపై విచారణ అని పేర్కొని, తాజాగా జారీ చేసిన సమన్లలో 2016 నుంచి అని పేర్కొన్నారని తెలిపారు. 2016కు ముందు రెండేళ్ల కాలంలో ఉన్న పాలకవర్గానికి మాత్రం సమన్లు జారీ చేయలేదని, ఎవరిని తప్పించడానికి అప్పటి పాలకవర్గానికి సమన్లు పంపలేదని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో జరిగిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేయకుండా ప్రస్తుత పాలకవర్గాన్ని విచారణకు పిలవడానికి విమర్శించారు. తమపై లేని ఆరోపణలను ఆపాదించి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారని రామారావు ఆరోపించారు. అయితే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, అదే సమయంలో తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కూడా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి తో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు.











