తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన.
సిరివెలుగు కోనరావుపేట: కోనరావుపేట మండలం ధర్మారం సెక్టార్ పరిధిలోని మర్తనపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహ కార్యక్రమంలో భాగంగా తల్లులకు పోషకాహారంపై అవగాహన నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కనకమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.సూపర్వైజర్ కనకమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎదుగుదలలో మొదటి వెయ్యి రోజుల ప్రాధాన్యతను తల్లులు గుర్తించి, ఈ దశలో సరైన పోషకాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్ సునీత మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపం రాకుండా తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న అన్ని సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్యాదపాక దీప, కార్యదర్శి రవి, ప్రధానోపాధ్యాయురాలు లయ, ఏ.ఎల్.ఎం.ఎస్.సి కమిటీ సభ్యులు, తల్లులు, గర్భవంతులు, బాలింతలు పాల్గొన్నారు.











