ఆఖరిక్షణంలో మారిన సమీకరణాలు.
మాజీ మండలాధ్యక్షులకే సింగిల్ విండో చైర్మన్ పదవులు!
నేతలను వరించనున్న నామినేటెడ్ పోస్టులు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామీనేటెడ్ పదవుల పందెరం హిట్ పుట్టిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతుంది. అధికార పార్టీ అధిష్టానం ఈ నామినేటెడ్ పదవులను ఎవరికి కట్టబెడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కాక రేపుతుంది. చాలామంది ఆశావాహులు ఈ నామినేటెడ్ పదవులు ఆశిస్తుండగా, ఇప్పటికే కొంతమందిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించినట్లు ప్రచారం కొనసాగుతోంది. కాగా ఆఖరి క్షణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆశావాహులను కలవరపెడుతున్నాయి.
సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా చొప్పదండి ప్రకాష్.

సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవిని 20 మంది నేతలు ఆశించగా, మొదట తంగళ్లపల్లి మండలానికి చెందిన వైద్య శివప్రసాద్, పూర్మాణి లింగారెడ్డి పేర్లు గట్టిగా వినిపించాయి. కాగా చివరి క్షణంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో సిరిసిల్ల పట్టణకాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. అధిష్టానం కూడా ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా చొప్పదండి ప్రకాష్ పేరుపై అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మాజీ మండలాధ్యక్షులకు సింగిల్ విండో ఛైర్మెన్ పదవులు.
అదలా ఉండగా మరోవైపు నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావు పేట, ఎల్లారెడ్దిపేట, వీర్నపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవుల విషయంలో మాజీ మండలాధ్యక్షులకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలోని సింగిల్ విండో ఛైర్మెన్ లు గా కొంతమంది మాజీ మండలాధ్యక్షులను అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని సింగిల్ విండో ఛైర్మెన్ పదవులకు కూడా మాజీ మండలాధ్యక్షులకు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. అలాగే ఇవే మండలాలలో ఖాళీ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ ల పదవిలు కూడా అతి త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.
సీఎం టూర్ తో దక్కనున్న పదవులు.
మార్కెట్ కమిటీలతో పాటు సింగిల్ విండో చైర్మన్ పదవుల భర్తీపై గత కొంతకాలంగా ఆశావహుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పదవుల కోసం పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తుండగా, చివరి దశలో మారుతున్న సమీకరణాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని సింగిల్ విండో చైర్మన్ పదవులకు మాజీ మండలాధ్యక్షుల పేర్లను పరిశీలించడంతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అధిష్టానం నుంచి మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం టూర్ సందర్భంగా కొంతమంది నేతలనైనా నామినేట్ పదవులు వరిస్తున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కాగా అధికారిక ప్రకటన వెలువడే వరకు పదవులు ఎవరిని వరించనున్నాయనే దానిపై ఉత్కంఠ కొనసాగనుంది.











