హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలిన.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఈ నెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే బుధవారం పోలీసు అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, హెలిప్యాడ్, పార్కింగ్ కోసం ఎంపిక చేయనున్న ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. వీఐపీ, వీవీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ శాంతయ్య, ఎస్ఐలు గణేష్, నాగరాజు, రాజుతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.











