ఆరోపణలపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలి.
మహిళా భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్.
సిరివెలుగు, హైదరాబాద్ :యువ పారిశ్రామికవేత్త కె. శోభారెడ్డి చేసిన వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లో మాట్లాడిన ఆమె వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా చెప్పుకున్న ఓ వ్యక్తి గెస్ట్హౌస్కు రావాలని కోరినట్లు శోభారెడ్డి సోషల్ మీడియా ద్వారా చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. ఒక మహిళ తన వ్యాపారానికి సంబంధించిన సమస్యపై ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరడం తప్పు కాదని కీర్తిరెడ్డి పేర్కొన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఒక మహిళ బహిరంగంగా వెల్లడించే పరిస్థితి ఏర్పడితే, మహిళా భద్రతకు సంబంధించి ప్రభుత్వం మరింత స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి.
మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభతో ముందుకు సాగాల్సిన సమయంలో రాజకీయ పరిచయాలు, అధికార ప్రభావం, మధ్యవర్తుల వ్యవహారాలపై ఆరోపణలు రావడం ఆందోళనకరమని కీర్తిరెడ్డి అన్నారు. శోభారెడ్డి చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఆరోపణలు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిపై వచ్చినా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా భద్రత అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సాటి మహిళకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని కీర్తిరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి అవసరమైన విచారణ, చట్టపరమైన చర్యలు చేపట్టే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.







