
సిరిసిల్లలో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మల దహనం
కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట.
సిరివెలుగు, సిరిసిల్ల: తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుర దేవరాజు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీచౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుర దేవరాజ్ మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితులను అవమానించడమేనని ఆరోపించారు. తాతా మధు వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సుర దేవరాజ్ విమర్శించారు. అలాగే కేటీఆర్ కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, జిల్లా ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. రియాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











